నిత్య జీవితంలో సంతోషంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను ఆచార్య చాణక్యుడు సూచించాడు. తన సూత్రాలతో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా కలిగే ప్రయోజనాలతో పాటు సాధించే విజయాలను వెల్లడించారు. చాణక్యుడు తెలిపిన కాకి నుంచి మనిషి నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఏంటో చూద్దాం..
మొండితనం..
అవును కాకి చాలా మొండి పక్షి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధిస్తుంది. అదేవిధంగా జీవితంలో పట్టుదలతో ఉండి, తన లక్ష్యాన్ని సాధించేందుకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కష్టపడుతుంది. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని కాకి స్వభావాన్ని బట్టి చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు.
ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు
కాకి జీవితం ఎవరినీ అంత తేలిగ్గా నమ్మవద్దని చెప్తుంది. కాకి తన తోటి పక్షులను నమ్మదు. అనుక్షణం అన్ని పక్షులను ఓ కంట గమనిస్తూనే ఉంటుంది. తన పరిసరాలను అనుక్షణం గమనిస్తూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు దాడి చేసినా తక్షణమే తప్పించుకుని తనను తాను కాపాడుకుంటుంది. ఇలా మనిషి జీవితంలోనూ తన చుట్టు పక్కల జరిగే విషయాలను గమనిస్తూనే ఉండాలి. లేదంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను విశ్వసించే ముందు వారిని క్షుణ్ణంగా పరిశోధించాలని సూచించాడు చాణక్యుడు.
ముందు జాగ్రత్త ఉండాలి
కాకి ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా కూర్చోవడం తనను తాను శుభ్రంగా ఉంచుకోవడాన్ని గమనిస్తూనే ఉంటాం. కాకి భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేస్తుందని పెద్దలు చెప్తుంటే వినే ఉంటాం. కాకి ఎక్కడి నుంచి ప్రమాదం వాటిల్లకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆరోగ్య విషయంలోనూ శుభ్రంగా ఉంటూ ఏ జబ్బు రాకుండా ముందుచూపుతో ఉంటుంది. మనిషి కూడా ముందు జాగ్రత్తతో ఉంటూ ముందుకు సాగాలి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూనే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మంచి విజయాలు సొంతమవుతాయని చెప్పాడు చాణక్యుడు.
దూరదృష్టితో ముందుకు సాగాలి
కాకి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో విషయం దూరదృష్టి. కాకి తన ఆహారాన్ని ముందుగానే సేకరించి నిల్వ చేసుకుని జాగ్రత్త పడుతుంది. కరువు సమయంలో లేదా ఆహారం లభించని సమయంలో నిల్వ చేసుకున్న ఆహారాన్ని తింటుంది. అదే విధంగా ప్రతీ మనిషి దూరదృష్టిని కలిగి ఉండాలని సూచించాడు చాణక్యుడు. భవిష్యత్తు గురించి ఆలోచించండి. అనుకున్న పనిని అనుకున్న సమయానికంటే ముందు పూర్తి చేసుకుంటే చివరి నిమిషం వరకు కష్టపడాల్సిన అవసరం ఉండదని చాణక్యుడు చెప్పాడు.
సహనంతో ఉండాలి
కాకి చాలా ఓపికతో ఉంటుంది. తోటి కాకులు గొడవ పడినప్పుడు సహనంతో ఉండి సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగుతుంది. మనిషి జీవితంలోనూ సహనంతో ఉంటే విజయం వైపు సాగవచ్చు. ఇలా ప్రకృతిలో ఉండే ఎన్నో జీవరాశుల ద్వారా మానవాళి నేర్చుకోవాల్సిన చాలా అంశాలను చెప్పాడు చాణక్యుడు.