ఇస్రో చేబట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) తన అత్యంత ప్రతిష్టాత్మక ‘చంద్ర వ్యోమనౌక’ ను నిన్న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టి మరో అద్భుతాన్ని సాధించింది. శనివారం ఇది చంద్రుని ఆర్బిట్ లోకి ప్రవేశించింది. రిట్రో ఫైరింగ్ ద్వారా దీని వేగం నెమ్మదించిందని, నిన్న రాత్రి 7 గంటల సమయంలో చంద్రుని సమీపంలో ఉండే పెరిలూన్ (Perillune) బిందువుకి చేరువైందని ఇస్రో శాస్త్రజ్ఞులు తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశామని వారు చెప్పారు.
వరుసగా మాక్స్, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ ప్రక్రియలను చేబట్టడం ద్వారా దీన్ని సాధించగలిగామన్నారు. ఇస్రోకిది మరో ఘన విజయం. ల్యూనార్ గ్రావిటీని ఈ నౌక ఆకళింపు చేసుకోగలిగింది. నెమ్మదిగా ఆర్బిట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో కృతకృత్యమవుతోంది. ఇక ఇస్రో లక్ష్యం.. దీని వేగాన్ని మరింత తగ్గించి ..సర్క్యులర్ ఆర్బిట్ లోకి అంటే చంద్రుని ఉపరితలంలో సుమారు వంద కి.మీ. దూరంలో చేర్చవలసి ఉంది.
కక్ష్యలో విజయవంతంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ (Space Craft) ని ప్రవేశపెట్టడంతోనే సరిపోదని, ల్యాండర్ (Lander) నుంచిదీన్ని వేరు చేసి చందమామ సౌత్ పోల్ (South Pole) .. అంటే దక్షిణ ధృవం వైపు మరల్చవలసి ఉందని ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ దక్షిణ ధ్రువంలో ఐస్, నీరు, ఇతర వనరులు ఉండవచ్చునని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఇదివరకే అంచనాలు వేసిన నేపథ్యంలో ఇస్రో సైంటిస్టులకు ఇది కూడా పెను సవాలే.. !
చంద్రుని చుట్టూ పరిభ్రమించనున్న ఈ వ్యోమనౌక.. ఈ నెల 23 న చంద్రుని ఉపరితలంపైకి చేరనున్న అద్భుత ఘట్టం ఎప్పుడు ఆవిష్క్రతమవుతుందా అని యావత్ దేశం ఆతృతగా ఎదురు చూస్తోంది. భారత సైంటిఫిక్ మేధో సంపత్తికి సంకేతమవుతున్న వ్యోమనౌక .. ఇతర ప్రపంచ దేశాల్లో దీన్ని ప్రతిబింబింపజేయడానికి ఇక ఎంతో కాలం పట్టబోదు.