ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తోంది. వ్యూవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని వారు చేసే కొన్ని వీడియోలు కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పనికి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చెక్ రిపబ్లిక్ (Czech Republic)లోని నాడ్ లాబెమ్ (Lysa nad Labem) అనే పట్టణంలో చెక్ ఇన్ఫ్లుయెన్సర్ (Czech Influencer ), టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ (Kamil Bartoshek) హెలికాప్టర్ ద్వారా ఏకంగా కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఎంత అంటే.. మిలియన్ డాలర్ల (1 Million Dollars) సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కమిల్ ముందుగా ఓ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారికి భారీగా నగదును బహుమతిగా అందించాలనుకున్నాడు. అయితే, అతడు పెట్టిన పోటీలో ఎవరూ గెలవలేకపోయారు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించాడు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాడు. ఈ క్రమంలో పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు.
అనుకున్నట్లుగానే కమిల్ ఆదివారం 6గంటల సమయంలో ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఎక్కడికి రావాలో కూడా పొందుపర్చాడు. ఇంకేముంది.. నిర్దేశించిన ప్రాంతానికి ఓ కంటైనర్‌లో ఒక మిలియన్ డాలర్లను నింపుకొని వెళ్లాడు. హెలికాఫ్టర్ ద్వారా లాబెమ్ పట్టణానికి సమీపంలోని ప్రదేశంలో ఆ డబ్బును జారవిడిచాడు.
అతడు హెలికాప్టర్ నుంచి వదిలిన మొత్తం డబ్బు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.8కోట్లకు పైమాటే. ఇక ఆ డబ్బుకోసం అక్కడున్న వారు పోటీపడి మీరీ దాన్ని పోగు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కమిల్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.