సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) గుండెపోటు(heart attack)తో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చెన్నెలోని ప్రముఖ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
డేనియల్ బాలాజీ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఆయన ఎక్కువగా విలన్ పాత్రల్లోనే నటించడం విశేషం. ఎన్టీఆర్ సాంబ సినిమా(Samba Movie)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఘర్షణ సినిమాలో వెంకటేష్ స్నేహితుడిగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. అంతేకాదు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు.
మొదట సీరియల్‌లో నటించిన డేనియల్ మూవీ మేకర్ కావాలనుకున్నారు. అయితే ఆయనకు వరుస పెట్టి విలన్ పాత్రలు తలుపుతట్టాయి. రామ్‌చరణ్ నటించిన చిరుత, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. చివరగా తెలుగులో హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్‌గా డేనియల్ బాలాజీ మెప్పించారు.
ఆయన ఆకస్మిక మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నిండింది. ఆయనతో సినిమా తీసిన డైరెక్టర్లు, హీరోలు, నటులు పలువురు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. డేనియల్ బాలాజీ అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.