ప్రముఖ హీరోయిన్, బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్(Deep Fake) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దేశంలో సాంకేతికపరమైన జాగ్రత్తలు అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ(Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు.
నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం.. మీడియాలో వార్తలు సైతం రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్(Womens Commission) సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఐపీసీ, 1860.. సెక్షన్లు 465, 469, ఐటీ యాక్ట్ 2000లోని 66సీ, 66ఈ కింద కేసు నమోదు చేశారు. కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
నవంబర్ 17లోగా నిందితుల వివరాలు, తీసుకున్న చర్యలతో కూడిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వాలని కమిషన్ కోరింది. రష్మికకు సంబంధించిన మరో వీడియో కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.