సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై బీజేపీ(BJP) కీలక నేత డీకే అరుణ (DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) నేతలకు వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.
అయితే, తాను మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు(Palamuru) అభివృద్ధికి ఎంతో కృషిచేశానని డీకే అరుణ వెల్లడించారు. నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టేనని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఇదే అహంకారం చూపితే ప్రజలు ఫామ్ హౌస్‌కు పంపించారని డీకే అరుణ తెలిపారు.
2014లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇప్పుడు ఉందా అని డీకే అరుణ ప్రశ్నించారు. కాళేశ్వరంపై జ్యుడీషియరీ ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తూ ఆ కాంట్రాక్టర్‌ను రక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రధానమంత్రిని మొన్న పెద్దన్న అన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో విమర్శలు వస్తే.. ఇప్పుడు మోడీ కేడి అంటున్నారని డీకే అరుణ ఫైర్ అయ్యారు. రేవంత్‌ను సొంత పార్టీ నేతలే ఏక్ నాత్ షిండే అంటున్నారని సెటైర్లు వేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం కేంద్రం 60శాతం నిధులు ఇస్తామని చెబుతున్నా.. జాతీయ హోదాకు ఎందుకు పట్టు పడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు.