తన చిటికెన వేలుపట్టి నడిపించి లోకాన్ని చూపించాల్సిన తండ్రి…కన్న కూతుర్నిఈ లోకంలోనే లేకుండా చేశాడు. భార్యతో గొడవ పడి సొంత కూతుర్ని గొంతు కోసి చంపేశాడు.
అనంతరం చిన్నారి వెనుక సీటులో పెట్టుకొని తాను డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో అతని దుర్మార్గం బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని చందానగర్లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్లోని చందానగర్కు చెందిన సాఫ్ట్వేర్( Software)ఉద్యోగి చంద్రశేఖర్ కు హిమాతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని (Software Job) కావడంతో ఆర్థికంగా కొన్ని రోజులు బాగానే గడిచాయి.
వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమార్తె కూడా జన్మించింది. చక్కని ఉద్యోగాలు, మంచి జీతం ..మంచి జీవితం. ఇలా సాఫీగా వెళ్తున్న తరుణంలో ఏడాది క్రితం చంద్రశేఖర్(Chandrasekhar) ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చంద్రశేఖర్ ఆత్మన్యూనతకు గురయ్యాడు.
తరచూ భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. ఈ టార్చర్ భరించలేని భార్య చిన్నారి మోక్షజ (8)తో కలిసి తన సొంతింటికి వెళ్లిపోయిందిసుమారుగా ఎనిమిది నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇది నచ్చని చంద్రశేఖర్..ఎలాగైనా భార్య ఆనందాన్ని భగ్నం చెయ్యాలనుకున్నాడు.
తన భార్యకు ఎంతో ఇష్టమైన తన సొంత కుమార్తెను అని కూడా చూడకుండా.. మోక్షజను బ్లేడ్తో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పథకం రచించాడు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పెద్ద అంబర్ పేట్ ఓఆర్‌ఆర్ (ORR) వద్ద మృతదేహాన్ని పడేసేందుకు యత్నించాడు.ఈ క్రమంలో కారు నడుపుతూ వస్తుండగా.. అతని కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు.
కారు వెనుక భాగంలో చిన్నారి మృతదేహాన్ని చూశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా… అసలు విషయం బయటకు వచ్చింది. చిన్నారిని తానే చంపినట్లు తండ్రి చంద్రశేఖర్ అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet)పోలీసులు..నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
భార్యకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. పాపను మాత్రం తరచూ కలిసేవాడు. బీహెచ్‌ఈఎల్ జ్యోతి విద్యాలయంలో మోక్షజ చదువుతుండగా.. శుక్లవారం సాయంత్రం3 గంటలకు స్కూల్ నుంచి పాపను చంద్రశేఖర్ తీసుకెళ్లాడు.
కారులోనే చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్ వద్ద కారు ప్రమాదానికి గురైయ్యింది. దీనిపై రాత్రి 10.30గంటల సమయంలో పోలీసులకు సమాచారం వచ్చింది.