– ఆర్టీసీ బిల్లుపై రగడ
– సీఎస్ కు గవర్నర్ లేఖ
– ఐదు అంశాలపై క్లారిటీ కావాలన్న తమిళిసై
– గవర్నర్ అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ
– మెరుగైన జీతాలు ఉంటాయని స్పష్టం
– రాజ్ భవన్ ను ముట్టడించిన కార్మికులు
– తొందరపడొద్దు.. మాట్లాడుకుందామన్న గవర్నర్
– తమిళిసైని కలిసిన టీఎంయూ నేతలు
ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లు (RTC govt merger Bill) వివాదాలకు దారి తీస్తోంది. గవర్నర్ (Governor Tamilisai)ను టార్గెట్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్గాలు విమర్శల దాడి చేస్తుండగా.. కార్మికులు ధర్నాల బాట పట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు నిలిపివేశారు. ఆ తర్వాత వేల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ (Raj Bhavan)ను ముట్టడించారు. మొదట వీరిని పోలీసులు విశ్వేశ్వరయ్య విగ్రహం చౌరస్తా వద్ద రాజ్ భవన్ రోడ్డులోకి రాకుండా నిలిపివేశారు. అయినా, బారికేడ్లను తోసుకుంటూ రాజ్ భవన్ వైపు పరుగులు తీశారు కొందరు. దాంతో పోలీసులు రాజ్ భవన్ వద్ద ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గవర్నర్ కొందరు నేతల్ని రాజ్ భవన్ లోపలికి అనుమతించడంతో వారు చర్చలు జరిపారు. బయటకు వచ్చాక టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ తమతో అన్నారని తెలిపారు. వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారన్నారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లు ఆమోదిస్తామని చెప్పినట్టు వెల్లడించారు. గవర్నర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఇటు ఈ వివాదంపై తమిళిసై, సీఎస్ మధ్య లేఖలు నడిచాయి. విలీన ప్రక్రియకు సంబంధించి గవర్నర్ కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కేంద్ర గ్రాంట్లు, లోన్లు గురించి వివరాలు లేవని, విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపైనా క్లారిటీ లేదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చింది. ఈ మేరకు కాపీని రాజ్ భవన్ కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని పేర్కొంది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్ లైన్స్ లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది.