టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దూరమైన సంగతి విధితమే. హార్దిక్ ఇప్పుడు టీ20కి కూడా దూరమయ్యాడు. అయితే రానున్న ఐపీఎల్(IPL-2024)కు సన్నహాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్‌లో ఉన్న హార్దిక్ తిరిగి ముంబై గూటికి చేరతాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాదు హార్దిక్ కోసం రూ.15కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్య ఏడేళ్ల పాటు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. 2022 సీజన్ ముందు ముంబై అతడిని వదులుకోగా.. గుజరాత్ జట్టు హార్దిక్‌ను సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక హార్దిక్ సారథ్యంలో వరుసగా రెండేళ్లు గుజరాత్ ఫైనల్స్‌కు చేరింది.
ఈ నేపథ్యంలోనే హార్దిక్ ముంబైకికి మారనున్న విషయంపై చర్చలు జరిగాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల విషయంపై అటు గుజరాత్ టైటాన్స్ గానీ.. ఇటు ముంబై ఇండియన్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఆదివారం వరకు సమయం ఉంది. అప్పటివరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేనట్లే అని అనిపిస్తోంది.
‘‘హార్దిక్ ఫ్రాంఛైజీ మారే అవకాశముంది. ఇంకా ఒప్పందం పూర్తికాలేదు” అని గుజరాత్ టైటాన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడింగ్‌లో భాగంగా రెండు జట్లు పరస్పరం ఆటగాళ్లను మార్చుకుంటాయి. మరి పాండ్యాకు బదులుగా ముంబయి జట్టు ఎవరిని పంపనుందనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.