రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య ఘర్షణ జరిగింది. అవిశ్వాస తీర్మానం విషయంలో కొత్తూరు మండలంలోని వైఎం తండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ లు అక్కడకు చేరుకున్నారు.
అవిశ్వాసం విషయంలో ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారి చివరకు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
అసలు ఏం జరిగిందంటే… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటి చైర్మన్ గా బీఆర్ఎస్ నేత రాజేశ్వర్ ఉన్నారు. ఇటీవల కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య వర్గం కాంగ్రెస్ గూటికి చేరింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ పై మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. ప్రస్తుతం మొత్తం 30 మందిలో ఇరు వర్గాలకు సమానంగా 15 మంది చొప్పున కౌన్సిలర్లు మద్దతుగా ఉన్నారు.
ఈ క్రమంలో ఓ వర్గం తమ కౌన్సిలర్లను రంగారెడ్డి జిల్లా కొత్తూరు శివారులోని ఓ ఫామ్ హౌస్లో దాచినట్టు తెలుస్తోంది. ఈ విషయం మరో వర్గానికి తెలియడంతో వాళ్లంతా ఫామ్ హౌస్ వద్దుకు చేరుకున్నట్టు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.