జాలి దయ లేదని అనే వాళ్ళని చూస్తే జాలి పడే రోజులోచ్చాయని అనుకొంటున్నారు.. నేటి సమాజంలో జాలి పడితే జైలుకే అనేలా జరిగిన సంఘటన గురించి తెలుసుకొన్న వారు.. ఇక రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడ, మగ తేడా లేకుండా లిఫ్ట్ (Lift) అడగడం కనిపిస్తుంది కదా.. అయ్యే పాపం ఏం అర్జెంట్ ఉందని జాలిపడి లిఫ్ట్ ఇస్తే.. ఇవ్వండి కానీ ఈ కిలాడి లేడి గురించి కాస్త తెలుసుకొని జాగ్రత్త పడండి..
వయ్యారంగా నడిరోడ్డుపై నిల్చుని కారులో వెళ్లేవాళ్లను లిఫ్ట్ అడుగుతుంది. పాపం అని జాలిపడి లిఫ్ట్ ఇస్తే.. కొంత దూరం వెళ్ళాక బట్టలు చింపుకొని రేప్ చేయబోయారని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటుంది. అలా పదుల సంఖ్యలో బెదిరింపు ఉదంతాలకు పాల్పడిన కిలాడి లేడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులు అరెస్ట్ చేశారు.
పైగా తాను అడ్వకేట్ (Advocate) అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ లిఫ్ట్ ఇచ్చిన వారిపై దబాయింపులకు దిగుతుంది. ఈ క్రమంలో తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ (KBR) పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారు ఎక్కింది. ఆపై దిగేముందు బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. భయపడిన సదరు డ్రైవర్ పరమానంద.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించిన పోలీసులు.. నగర వ్యాప్తంగా పలు స్టేషన్‌లో ఇదివరకే 17 కేసులు నమోదైన్నట్లు గుర్తించారు. ఆమెపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా ఇలాగే పలువురు అమాయకుల మీద తన ప్రతాపం చూపించి కేసులు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది..