కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై కారాలు మిరియాలు నూరుతున్న కేసీఆర్ (KCR).. తనలో ఉన్న పాత మనిషిని చూస్తారని హెచ్చరించారు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.. కాగా అసలే ఆయన ముద్దుల కూతురు కవిత (Kavitha) అరెస్టు అయ్యారని బయటికి కనబడకుండా రగులుతున్న గులాబీ బాస్ తాజాగా స్పందించారు..
కవిత అరెస్ట్ ని ఖండించిన ఆయన.. అది ముమ్మాటికి అక్రమ అరెస్టు అని విమర్శించారు.. తన కూతురు తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేదని పేర్కొన్న కేసీఆర్.. బీఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే అసలు ఈ అరెస్టు ఉండకపోయేదని.. ఆమెను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్న ఆయన.. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్ (BRS)కే మేలు జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.. రానున్న రోజులు మనవే అని పేర్కొన్నారు.. పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సూచించారు.. అలాగే పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన అలాంటి నేతల వల్ల బీఆర్ఎస్కు నష్టం లేదని తెలిపారు..
ఇదిలా ఉండగా.. కార్యకర్తల్లో.. ప్రస్తుతం ఉన్న నేతల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు సమాచారం.. ఉదయం 11 గంటల వరకు పొలం బాట.. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం నుంచి 2-3 చోట్ల రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని అనుకొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనే వ్యూహంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..