పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటికి రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.. ఇందుకోసం మోడీ (Modi), అమిత్ షా (Amit Shah) ద్వయం ప్రయత్నిస్తోందని, అందుకోసమే 400 ఎంపీ సీట్లను అడుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని తెలిపారు. వీటి అవసరం ఉన్నంత కాలం కొనసాగించవలసిందే అని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల వరుసగా ఆరోపణలు గుప్పించడం కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు హైదరాబాద్ (Hyderabad)కు వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పేరు ప్రస్తావించకుండా ఆ సంస్థపై జరుగుతోన్న ప్రచారాలను తిప్పికొట్టారు.. స్వార్థంతో మాట్లాడుతున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అని మండిపడ్డారు.. వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారు పూర్తిగా అభివృద్ధి చెందేవరకు ఇలాగే కొనసాగించాల్సిందే అని తెలిపిన ఆర్ఎస్ఎస్ చీఫ్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అని పేర్కొన్నారు. ఓట్ల కోసమే ఈ నాటకాలకు తెరతీసినట్లు ఆరోపించారు..