ఎన్నికల వేళ లిక్కర్ స్కాం(Liquor scam)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ అరెస్టు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(MLA Jagadeesh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆధారాలున్నాయంటున్నారని.. ఈడీ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అండర్ స్టాండింగ్‌తో అభ్యర్థులను పెడుతున్నారని తెలిపారు. ప్రజల్లో బలం లేని ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. గతంలో కవితను విచారణ చేసి, ఏం తేలలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కవిత కేసుపై కిషన్ రెడ్డి ఆధారాలున్నాయంటున్నారని, మరి ఈడీ కల్పించుకుని కిషన్‌రెడ్డిని విచారించాలని జగదీశ్ రెడ్డి సూచించారు. ఒకవైపు రాష్ట్రంలో చాలా చోట్ల పొలాలు ఎండి పోతున్నా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్ఎండీ అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్ళడానికి మంత్రులకు లాగులు తడుస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందని ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసిందంటూ విరుచుకుపడ్డారు.