కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari)పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఆయన కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మండిపడ్డారు.. బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతుందని ఆరోపించారు.. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని తెలిపిన ఆయన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దోచుకొన్నారని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కారణం అయిన ఆయనే ప్రజలకు జవాబు దారి అని కడియం పేర్కొన్నారు.. అలాగే గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు.. కాళేశ్వరం బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆర్ (KCR) చర్యలని పేర్కొన్న ఆయన ఇందుకు బాధ్యత ఆయనే వహించాలని తెలిపారు.. ఆయన అక్కడ కుర్చీ వేసుకొని నీళ్ళు వదిలితే కుర్చీతో పాటు కూడా కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ (BJP) విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆపదలో ఉందన్న శ్రీహరి.. నా కూతురు ఎస్సీ కాబట్టే స్క్రూటినీలో రిటర్నింగ్ అధికారులు ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదని తెలిపారు. బయటమాట్లాడే సన్యాసులు స్క్రూటినీలో ఎందుకు అభ్యంతరం చూపలేదని మండిపడ్డారు.. ఎందుకు ఆధారాలు చూపలేదని ప్రశ్నించారు.. హరీశ్ రావుది రాజీనామా డ్రామా అని తెలిపిన ఆయన.. చేసిన సవాల్ కు సీఎం కట్టుబడి ఉన్నారన్నారు.
మరోవైపు నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మంద కృష్ణ నా ఇంటికి వచ్చి దండం పెడతాడని వ్యాఖ్యానించిన కడియం.. నావద్ద వందల కోట్లు ఉన్నది నిజమైతే.. ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ సోదాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నా తర్వాత 20 ఏళ్లకు పుట్టిన వెధవలకు నేను సమాధానం చెప్పనని ధ్వజమెత్తారు.. అలాగే ఫోన్ ట్యాపింగ్ కామన్ అన్న కేసీఆర్ అధికారులను బలి చేశారని గుర్తు చేశారు.. ఈ కేసులో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఇరికించారని విమర్శించిన కడియం.. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు..