మరక మంచిదే పది రూపాయలతో వదిలిపోతుంది.. కానీ కేసీఆర్ (KCR) ముద్దుల కూతురు.. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కి అంటిన మరకకు ఎన్ని కొట్లు ఖర్చు చేయాలో అనే చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పూర్తిగా కూరుకుపోయిన తెలంగాణ ఆడపడచు.. బతుకమ్మ పండక్కి ఫేమస్ అంబాసిడర్.. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వ్యవహారాల్లో అన్ని తానై నడిపించిన కవితమ్మను, ప్రస్తుతం ఈడీ వదల బొమ్మాళీ అంటూ వెంటపడుతోందని వార్తలు వస్తున్నాయి..
బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నన్ని రోజులు రాజహసాన్ని ప్రదర్శిస్తూ.. తెలంగాణ (Telangana) దేశానికి యువ రాణీలా సకల వైభోగాలు అనుభవించిన కవితకు.. ఈడీ అధికారులు షాక్ ఇచ్చారని అనుకొంటున్నారు.. ఎవరు ఊహించని విధంగా ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లా మారిన ఈ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగా కవిత (Kavitha) ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఇప్పటి వరకూ వరుస సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. అదీగాక కస్టడీలో జరిగిన విచారణలోనూ కీలక సమాచారాన్ని సైతం సేకరించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళూ కొండను తవ్వుతూ ఎలుకలను పట్టారనే అపవాదు మూట గట్టుకొన్న ఈడీ.. ఈ సారి గట్టిగా పెద్ద కొండను ఢీ కొట్టి లోతుగా తవ్వుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తవ్వేకొద్దీ కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటున్నారు.. ఇక ఈ స్పీడ్ చాలదని భావించిన ఈడీ.. మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిందని ఢిల్లీ (Delhi) వర్గాల్లో చర్చలు మొదలైయ్యాయి.. ఈ నేపథ్యంలో ఇక్కడ కవితకు ఉన్న ఆస్తులెన్ని..? ఏయే వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు..? కవిత బినామీలు ఎవరు..? అనే కోణాల్లో దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం.. విచారణలో అతనెవరు అని అడిగితే కవిత నుంచి సమాధానం రాకపోవడంతో అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఇప్పట్లో ఈ వ్యవహారానికి ముగింపు లేనట్లే అనే చర్చలు మొదలైయ్యాయి..