లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి (Bhadradri) సీతారాముల కల్యాణ (Sitaramula Kalyanam) ఘట్టాన్ని లైవ్ ఇవ్వొద్దని ఈసీ ఇటీవల ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా ఈ విషయంలో స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. ఈ కల్యాణాన్ని ప్రభుత్వం తరఫున ప్రత్యక్షప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఈవో వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.

అదీగాక సుమారు నలభై ఏళ్లుగా రామయ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షప్రసారం చేయడం సంప్రదాయంగా ఉందని మంత్రి ఈసీకి వివరించారు. అలాగే ఈ కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయని పేర్కొన్నారు..
అందుకే స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని సీఈవోను మంత్రి కొండా సురేఖ కోరారు. మరోవైపు రామయ్య కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న వేళ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు..