రాజకీయాల లెక్కలు ఎవరికి అర్థంకావు.. ఎందుకంటే ఇక్కడ విజయాలు మాత్రమే కౌంట్ అవుతాయి.. అపజయాలు మైనస్ లా మారతాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ (BRS) లెక్కలు పూర్తిగా మారిపోయాయని తెలుస్తోంది. పార్టీ పై నమ్మకం సన్నగిల్లడంతో.. కారు దిగుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇదే సమయంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ప్రస్తుతం గులాబీలో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ (KCR) వల్ల గెలిచిందంటారు. ఆయన వ్యూహాలకు సలాం అంటారు. ఆయన నివాసానికి క్యూ కడతారు. కేసీఆర్ వీరుడు.. శూరుడు.. విక్రమార్కుడు అంటూ ప్రశంసలు కురిపిస్తారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఆయన కంటే గొప్ప వ్యక్తి మరొకరు లేరన్నారు. ఆయన వ్యూహాలకు మరే రాజకీయ నేత ఆలోచనలు సాటి రావన్నారు. స్కెచ్ వేస్తే సెటిల్ అయినట్లేనని చొక్కా బటన్లు విప్పి మరి చెప్పుకొన్నారు.
కానీ అరవై రోజుల్లో పరిస్థితి మారిపోయింది. కాగా విశ్రాంతి తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్.. నల్లగొండ (Nalgonda) సభలో ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతుండటం విశేషం. అభ్యర్థుల కొరత లేదని చెప్పలేం కానీ, గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు గులాబీ టిక్కెట్ కోసం వెంపర్లాడటం లేదు.
కాంగ్రెస్ గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి జంకుతున్నారనే టాక్ వినిపిస్తోంది. నచ్చచెప్పి.. ఒప్పించి బలవంతంగా బరిలోకి దింపాల్సిన పరిస్థితి ప్రస్తుతం తలెత్తిందని తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గుబులు మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్లాన్లో ఉందని సమాచారం.. అయితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూసి.. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకొనే ఆశావాహుల్లో గెలుస్తామా? లేదా? అనే టెన్షన్ మొదలైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు.