సాధారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు వలలో వందలాది చేపలు చిక్కితే ఇక వారికి పండగే. కొన్నిసార్లు వలలో అరుదైన చేపలు.. విచిత్ర జంతువులు చిక్కుతుంటాయి. ఒక్కోసారి భారీ ధర పలికే చేపలు సైతం పడుతుంటాయి. అలా అరుదైన జాతికి చెందిన చేపలు వలలో చిక్కితే ఇక వారికి లాభాల పంటే అని చెప్పొచ్చు.
తాజాగా కాకినాడ జిల్లా యానాం(Yaanam)కు చెందిన పోన్నమండ భద్రం అనే మత్స్యకార మహిళ యానాం మార్కెట్‌కు అరుదైన చేపను అమ్మకానికి తెచ్చింది. మీనం(Meenam Fish) చేప సుమారు 6 గంటల పాటు బతికి ఉన్నట్లు ఆమె తెలిపింది. ఈ చేపను మురుబొంత అని కూడా పిలుస్తారని మత్స్యకారులు తెలిపారు.
కాగా, మీనం చేపలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మీనం చేప తిన్న వారికి విటమిన్ బి-12, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఇంగ్లీష్‌లో రీప్ కాడ్ ఫిష్(Reap codfish) అంటారు. ఇక తమిళ, మలయాళంలో కలపమీన్ అని పిలుస్తారు.
అయితే, కిలో బరువు ఉన్న ఈ మీనం చేపను యానాం మార్కెట్‌లో రూ. 600కు విక్రయించినట్లు మత్యకార మహిళ భద్రం తెలిపింది. కాగా, వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఇలాంటి అరుదైన చేపలు అప్పుడప్పుడు దొరుకుతుంటాయని, అవి రికార్డు ధర పలుకుతుంటాయని స్థానికులు తెలిపారు.