ఇటీవల పెద్దపెద్ద కంపెనీలు సైతం ఆర్థిక కారణాలు సాకుగా చూపి భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’(Micro Soft) వచ్చి చేరింది. గతేడాది 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ తాజాగా మరికొంత మందికి ఉద్వాసన(Layoff) పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మైక్రోసాఫ్ట్.. మరో 1900 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మందికి లేఆఫ్ ప్రకటించనున్నట్లు మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ వెల్లడించారు.
యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ గతేడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మందిని తొలగించనున్నట్లు ఈమెయిల్‌లో ఫిల్ స్పెన్సర్ వెల్లడించారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది.
కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ముందు కూడా కొందరిని తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది.