మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో నేడు కెరమెరి (Kerameri) మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ఆదివాసులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుహ లోపలకు వెళ్లి జంగుబాయికి ప్రత్యేక పూజలు, దీప దర్శనం చేసుకొన్నారు.
ఆదివాసుల ఆరాధ్య దైవమైన జంగుబాయి దేవత ఎవరు ఏది కోరుకున్న నెరవేర్చే దేవత అని కొనియాడారు. ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన జంగుబాయి పుణ్యక్షేత్రం అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సీతక్క తెలిపారు. పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
మరోవైపు ఈ పుష్యమాసంలో జరిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలాగే, మర్లా వాయికి కూడా నిధులు విడుదల చేస్తామన్నారు. అనంతరం ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో.. జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు ఆయా శాఖల సంక్షిప్త నివేదికలతో మంత్రితో సమావేశం అయ్యారు.
ఈమేరకు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. భూసంబంధిత, ఆసరా, డబుల్ బెడ్ రూం ఇళ్లు, తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈక్రమంలో అధికారులను ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మరోవైపు గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. వారు కూడా మనలాగే మనుషులన్న విషయాన్ని గుర్తించాలని వెల్లడించారు.