క్రికెట్(Cricket)లో బౌలర్లు వైడ్ బాల్స్(Wide ball) వేయడం సహజం. బౌలింగ్ వేశాక క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలోకి బాల్ వెళ్తుంది. ఓవర్‌లో ఒకటి లేదా రెండు సార్లు ఇలాంటి తప్పిదం సాధారణంగా జరుగుతుంటుంది. తాజాగా ఓ బౌలర్ అందరూ షాక్ అయ్యే పనిచేశాడు. ఈ వైడ్ బాల్ భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో నమోదైంది.
ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సఫారీ పేసర్ గెరాల్డ్ (Gerald Coetzee) కోట్టీ భారీ వైడ్ వేశాడు. ఆ బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి వెల్లాల్సింది కాస్త ఫస్ట్ స్లిప్ ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి పడిందంటే ఏ స్థాయిలో వైడ్ పడిందో అర్థం చేసుకోవచ్చు.
గెరాల్డ్ ఈ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో వేసిన మొదటి బంతిని భారీ వైడ్ వేశాడు. బంతి కీపర్ క్వింటన్ డీకాక్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. బాల్ ఏకంగా ఫస్ట్ స్లిప్ ఉన్న హెన్రిక్ క్లాసెన్ వద్దకు దూసుకెళ్లింది. బంతిని పట్టుకొన్న క్లాసెన్ నవ్వగా డీకాక్ కూడా తెగ నవ్వేశాడు. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పూశాయి. ఈ వైడ్ బాల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. , ‘దెబ్బకు కెమెరామ్యాన్ షాక్ అయ్యాడు’, ‘ఇంత పెద్ద వైడ్ నేనెప్పుడూ చూడలేదు’, అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది.