రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో ధరణి కమిటీతో (Dharani Committee) భేటీ అయ్యారు. ఇందులో భాగంగా మధ్యంతర నివేదికపై మంత్రి పొంగులేటితో కమిటీ సభ్యులు చర్చించారని తెలుస్తోంది. రేపు సిద్దిపేట, మెదక్ సహా నాలుగు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది.
ఈ క్రమంలో క్షేత్రస్థాయి భూ సమస్యలపై కమిటీ సభ్యులు ఆరా తీయనున్నారు.అనంతరం మధ్యంతర నివేదికను సిద్ధం చేసి మంత్రి పొంగులేటికి ఇవ్వనున్నారు. ఆ తరువాత కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మంత్రి పొంగులేటి చర్చించనున్నట్లుగా సమాచారం. కాగా ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు రూపొందించనున్న విషయం తెలిసిందే.
ధరణి పోర్టల్ లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇబ్బందులు రాకుండా చూసుకోవడమూ కూడా అంతే ముఖ్యమని తెలిపిన కమిటీ.. ఏ సమస్యనూ పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. వివిధ రాష్ట్రల యొక్క రెవెన్యూ విధి విధానాలను మాత్రమే ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్‌వేర్‌తో పాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయవచ్చనే అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.