ఈ సంక్రాంతికి టాలీవుడ్ (TollyWood) బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మహేశ్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో పాటు ఇతర హీరోల సినిమాలు ఈ సంక్రాతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వాటిలో గుంటూరు కారం, హనుమాన్ (Hanuman) సినిమాలు జనవరి 12న విడుదల కానున్నాయి.
సంక్రాంతి రేసు నుంచి ‘హనుమాన్’సినిమాను తప్పించేందుకు తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన సినిమాకు అడగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ఒత్తిడి తీసుకు వస్తున్న వ్యక్తి ఎవరో, అతనితో అలా ఎవరు చేయిస్తున్నారనే విషయం గురించి తనకు పూర్తిగా అవగాహన లేదన్నారు.
ఇటీవల సెన్సార్ విషయంలోనూ తమకు అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. కానీ అదృష్టవశాత్తు సెన్సార్ పూర్తయిందని తెలిపారు. ఇలాంటి అడ్డంకులను తాను ఊహించలేదన్నారు. అసలు కొన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. సెన్సార్ విషయంలోనూ అడ్డంకులు ఎదురయ్యాయయన్నారు.
కానీ తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఈ అడ్డంకులను అధిగమించగలిగానని చెప్పారు. ఇది ఇలా వుంటే మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం జనవరి 12న, రవితేజ ఈగల్ జనవరి 13న, వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రం జనవరి 14న విడుదల కానున్నాయి. నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రానికి విడుదల డేట్ ఇంకా ప్రకటించలేదు.