Russia : రష్యా ప్రయోగించిన లూనా-25 (Luna -25) చంద్రునిపై కూలిపోయింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ (Space Craft) కంట్రోల్ తప్పిపోయి చివరకు చంద్రుని ఉపరితలంపై కూలిపోయినట్టు రోస్ కాస్మోస్ స్పేస్ కార్పొరేషన్ ప్రకటించింది. శనివారం ప్రీ-ల్యాండింగ్ ఆర్బిట్ లో దీన్ని చేర్చే ప్రక్రియ విఫలం కావడంతో తాము దీంతో కాంటాక్ట్ ని కోల్పోయినట్టు పేర్కొంది. చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొన్న ఫలితంగా తాము ఊహించని ఆర్బిట్ లోకి చేరిందని, తన ఉనికినే లేకుండా చేసుకుందని రష్యన్ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. లూనా-మిషన్ ఫెయిల్యూర్ అయిందని అన్నారు.
అర్ధాంతరంగా ఈ పరిణామం జరగడంవల్ల రష్యా అంతరిక్ష పరిశోధనలకు విఘాతం కలగడమే గాక ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ షాక్ కి గురి చేసింది. తన ల్యూనార్ ఎక్స్ ప్లోరేషన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాల్లో లూనా -25 మిషన్ కూడా ఒకటి. ఇది చంద్రుని దక్షిణ ధృవంపై దిగవలసి ఉంది.
ఇందుకు అనువుగా ఈ వ్యోమనౌకను డిజైన్ చేశారు. ఇందులో సాంకేతిక సమస్య తలెత్తిందని, దీంతో ఆటోమేటిక్ స్టేషన్ లో ఎమర్జెన్సీ వంటి పరిస్థితి ఏర్పడిందని రోస్ కాస్మోస్ వెల్లడించింది. ఫలితంగా విన్యాసాలను నిర్వహించడానికి వీలు లేకపోయిందని తెలిపింది. సుమారు 5 దశాబ్దాల అనంతరం మొదటిసారిగా చంద్రునిపై పరిశోధనలకు రష్యాఈ వ్యోమనౌకను ప్రయోగించింది.
లూనా-25 ని ఈ నెల 11 న వోస్తోక్నీ కాస్మొడ్రోమ్ నుంచి ప్రయోగించారు. దాదాపు పది రోజులపాటు ప్రయాణించిన ల్యాండర్ కొన్ని గంటల క్రితమే చంద్రుని ఫోటోలను పంపింది. మరికొన్ని గంటల్లోనే అక్కడ దిగేందుకు సిద్ధమైన సమయంలో క్రాష్ అయింది. ఇందుకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఓ ప్రత్యేక ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిషన్ ను నియమించారు. లూనా-26. లూనా-27 మిషన్లను కూడా చేపట్టడానికి ఈ లూనా-25 మిషన్ తోడ్పడుతుందని భావించామని, కానీ ఇది విఫలమైందని రోస్ కాస్మోస్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి.