తెలుగు ప్రజల అతిపెద్ద ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి(Sankranti) ఒకటి. మూడు రోజుల ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే పట్టణాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన వారు, చదువుకునే విద్యార్థులు రెండు రోజుల ముందు నుంచే సొంతూళ్లకు క్యూకట్టారు. ఇప్పటికే నగరం నుంచి అరకోటి మంది జనం సొంతూళ్లకు చేరుకున్నారు. ఆదివారం భోగి వేడుక(Bhogi Festival) అంబరాన్నంటింది.
ఇవాళ(సోమవారం) సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో మరింత సందడి వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు. పల్లెల్లో గృహిణులు పిండివంటలు చేస్తూ, యువతులు ముగ్గులు వేస్తూ, పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ కుటుంబసభ్యులంతా ఆనందంగా గడుపుతున్నారు.
ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగ సందడి అంతాఇంతా కాదు. అక్కడ కోళ్లపందాలు జోరుగా సాగుతున్నాయి. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అంతేకాదు.. కొందరు అరుగులపై పేకాట ఆడుతున్నారు. మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సాయంత్రం వరకు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పండుగ కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే, పట్టణాల్లోనూ సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. రాత్రిపూట మహిళలు కబుర్లు చెప్పుకుంటూ వీధుల్లో అందమైన రంగవల్లులను వేశారు. అపార్ట్మెంట్లు, ఇళ్ల అంతస్తులపై పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. మరికొందరు డీజే సౌండ్లు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ గాలిపటాలు ఎగురవేయడం విశేషం.
అపార్ట్మెంట్ వాసులంతా ఒకేచోట చేరి డీజే సౌండ్లు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యుడి సందడి ఇలా ఉంటే.. ధనికులు, సెలబ్రెటీలు నగర శివార్లలో పల్లె వాతావరణాన్ని మైమరిపించే ఫామ్‌హౌస్‌లో టికెట్ పెట్టి మరీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అందరూ ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.