Telugu News » What is this Vintage: సెల్ఫ్ చెక్ ఫర్ సీనియర్ హీరోస్..!

What is this Vintage: సెల్ఫ్ చెక్ ఫర్ సీనియర్ హీరోస్..!

ఒకప్పుడు తమ పాటలు, ఫైట్లు,యాక్షన్ సీన్లతో తెలుగు తెరను చించి ఆరేశారు. తమ అభిమాన హీరోలు చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్లు, వేసిన డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేసి..పెళ్లిళ్లు చేసినుకుని బాధ్యతలు నెత్తినేసుకుంది.

by sai krishna

ఒకప్పుడు తమ పాటలు, ఫైట్లు,యాక్షన్ సీన్లతో తెలుగు తెరను చించి ఆరేశారు. తమ అభిమాన హీరోలు చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్లు, వేసిన డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేసి..పెళ్లిళ్లు చేసినుకుని బాధ్యతలు నెత్తినేసుకుంది. ఇంకో జనరేషన్ వచ్చింది తమ అభిమాన హీరోలకు బ్యానర్లు కట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం బట్టలు చించుకుంది.

ఆ తర్వాత వచ్చిన జనరేషన్ తమ అభిమాన హీరో తొడకొడితే చూసి తరించింది. గాల్లోకి సుమోలు లేస్తుంటే జౌరా ! అనుకుంటూ నోరెళ్లబెట్టింది. తరాలు మారుతూనే ఉన్నాయి, పెరిగిన టెక్నాలజీ మన హీరోలకు కట్టుబానిసైంది. అప్టట్లో తమ హీరోకి మొదటి బ్యానర్ కట్టిన వ్యక్తి, తెరమీద పూలు జల్లిన అభిమాని ఇప్పుడు తాతయ్యాడు. అయినా మన తెలుగు సీనియర్ హీరోల పవరు తగ్గలేదు.

మన హీరోలు మాత్రం ఎత్తిన కత్తి దించలేదు. స్టెప్పులేయడం ఆపలేదు. ఒకప్పుడు మెలికలు తిరిగిన నడుం పెరిగిన వయసుతో, పోరాటం చేస్తున్నా కుర్ర హీరోయిన్ల కోసం దాయి దాయి దామ్మా అంటున్నారు. కళ్లకింద క్యారీబ్యాగ్ లు వస్తున్నా టీనేజ్ హీరోయిన్ని ‘లక్స్ పాపా లక్స్ పాపా లంచుకొస్తావా’ అంటూ చేతులు చాస్తున్నారు. చెంపలపై చర్మ వేల్లాడుతున్నా ‘బలపం పట్టి భామ బళ్లో’ అంటూ మెలికలు తిరుగుతున్నారు.

చర్మం ముడతలు పడుతున్నా, వేస్తున్న డ్యాన్స్ హీరోయిన్ కి అడ్డం పడుతున్నా ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ అంటూ కాళ్లూ చేతులూ ఆడిస్తూనే ఉన్నారు. తమ అభిమానులను ఒకప్పట్లా మెప్పించడానికి ఇంకా అవిశ్రాంతంగా తన శరీరాన్నీ కష్టపెడుతూనే ఉన్నారు. పస్తులు పెడుతూనే ఉన్నారు. తిప్పలు పడుతూనే ఉన్నారు. అలాంటి సీనియర్ హీరోల లిస్ట్ లో మొదటిగా వచ్చే హీరో మెగాస్టార్ చిరంజీవి.

 

చిరంజీవి Chiranjeevi:

నిజమే చిరంజీవి పేరు చెప్పగానే ప్రేక్షకులే కాదు హీరోలు కూడా విజిల్స్ ఏస్తారు. బతికితే అలా బతకాలనుకుంటారు. కెరీర్ కోసం ఎన్నోత్యాగాల్ని చేస్తేగాని..ఒళ్లుని విల్లులా వంచలేరు, కలెక్లన్ల ఊచకోత కోయలేరు. తరాలు మారుతున్నా చిరం జీవి చిరం జీవిలానే ఉన్నాడు.

 

ఒకప్పుడు సినిమా నుంచి పాలిటిక్స్ లోకి వెళ్లి పక్కకు జరుగుతాడనుకున్న చిరంజీవి రుచించని రాజకీయాల నుంచే పక్కకు జరిగాడు.రెడీ కెమెరా యాక్షన్ కి అలవాటు పడ్డ ప్రాణం కదా.

పక్కవాళ్లని పనిగట్టుకుని తిట్టి, తిడితే భరించే శక్తిలేని ముఖ్యంగా అవసరం లేని చిరంజీవి మళ్లీ అదే గ్రేసు,అదే జోష్ తో కెమెరా ముందుకు వచ్చారు.జనం కూడా తమ వింటేజ్ చిరం జీవికోసం బాస్ ఈజ్ బ్యాక్(The boss is back) అని వెల్కం చేశారు.అయితే గత కొద్దికాలంగా మెగాస్టార్ చేస్తున్న సినిమాలు ఉన్న ఇమేజ్ ని ఇరుకున పెట్టేలానే ఉన్నాయి.

వయసుకు తగ్గ కథలు కాకుండా ఇంకా ఏదో చేద్దామనే అత్యాశ కథల్నే ఎంచుకుంటున్నా రన్నవిమర్శలు వస్తున్నాయి.కొత్త కొత్త వినోద మార్గాలు, ఫ్లాట్ ఫామ్ లు వస్తున్న తరుణంలో అదే వెగటుపుట్టించే డ్యాన్సులు, డైలాగులు చెబుతుంటే అభిమానజనం జీర్ణించుకోలేకపోతున్నారు.

బాలకృష్ణ(Balakrishna):

తెలుగు సినిమాకి వరంలాంటి రూపం.తండ్రి సీనియర్ ఎన్టీఆర్(Senior NTR)నటవారసుడిగా, ఆయన వేసిన బాటలో నడిచే అనుచరుడిగా ఎంతో వినోదాన్ని పంచుతున్నారు.గంభీర మైన స్వరం, మళ్లమళ్లీ వినాలనిపించే డిక్షన్, పంచెకట్టి నిలబడితే విలన్ల పంచె తడిచేలా చేసే యాక్షన్..వెరసి “జైబాలయ్య’’. డైక్టర్ని నమ్మితే కథేంటని, సీనేంటని కూడా అడగడని ఇంస్ట్రీటాకు.

ప్రేక్షకులు ఇది చూసి విజిల్స్ వేస్తారని చెబితే అది చేస్తాడట. ఒకప్పుడు డైరెక్టర్స్(Directors)ట్రాప్ లో ఇరుక్కుని ప్లాపులు మూటగట్టుకున్న బాలయ్య హిట్టు మీద హిట్టుకొడుతున్నాడు.నిర్మాతలకు కలెక్షన్లు మూటగడుతున్నాడు.వయసు మీద పడుతున్నా ఏమాత్రం వెనక్కు తిరిగి చూడ కుండా సినిమా కోసం మీసాలు తిప్పుతూనే ఉన్నాడు మన బాలయ్య.

అయితే సగటు ప్రేక్షకుడికి కావాల్సింది ఏఇతర భాషలకు తీసిపోని కథ,కథనం, వైవిధ్యం, ఆ హీరో పంచే తనదైన మార్క్ శైలి. కలెక్షన్లు కాదు. ప్రేక్షకులకు కావాల్సింది ఉత్తమ వినోదం. ఆ లెక్కల చట్రంలో ఇరికించిన డైరెక్టర్లు బాలయ్యను బైటకు రానివ్వలేదు, తండ్రి ఎన్టీఆర్ చేసిన పాత్రల్లో పదోవంతు కూడా బాలయ్యను ఏ పాత్ర చెయ్యనివ్వలేదు మన తెలుగు సినిమా.

బాలయ్య చేయగలిగే పాత్రలు ఉన్నా దశాబ్ధాలుగా సినిమాలో ఎనభైశాతం ఒకే ఎమోషన్ ని చూపిస్తున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదన్నది కరుడు కట్టిన బాలయ్య అభిమాని కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవం.

వెంకటేశ్(Venkatesh):

తెలగు తెరకు దొరికిన అద్భుతమైన నటుడు.మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడి కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టి,ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాడు.కలియుగ పాండవులు, ప్రేమ, బొబ్బిలిరాజా, ప్రేమ,చంటి, ధర్మచక్రం,వాసు, ప్రేమించుకుందాం రా,గణేశ్,ఘర్షణ,గురు,ఎఫ్ టూ, ఇలా చెప్పుకుంటూ పోతే వేటికవే ప్రత్యేకమైన సినిమాలు అవి వెంకటేశ్ తప్ప మరోనటుణ్ణి కనీసం ఊహించుకోడానికి కూడా వీలు లేని సినిమాలు.

అయితే అలాంటి దమ్మున్న హీరో ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నాడో ఎవరికీ అంతు పట్టటం లేదు. ఏం చెయ్యాలో తెలియక తన అన్న కొడుకు దగ్గుబాటి రాణాతో ‘రానా నాయుడు’ లాంటి సినిమాలో చేసేసి ఎన్నోబూతులు మూటకట్టుకున్నాడు.స్వతహాగా రమణ మహర్షి(Sage Ramana)ఫాలోవర్ అయిన వెంకటేష్ అలాంటి సినిమా చేస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించరు.

ఇప్పుడు వెంకటేశ్ కి సైంధవ(Saindhava)సినిమా తప్ప వేరే సినిమా ఎనౌన్స్ కాలేదు.ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి నటన విషయంలో వెంకటేశ్ ట్రై చేసిన వైవిధ్యమైన పాత్రలు మరే తెలుగు హీరో పెద్దగా ట్రై చెయలేదనే చెప్పాలి. హీరోయిన్ తో స్టెప్పుల సంగతి పక్కన బెడితే నటన పరంగా వెంకటేష్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు.

నాగార్జున(Nagarjuna):

తండ్రిలాగే అక్కినేని నాగేశ్వర్రావులాగే నాగార్జున ఎవర్ గ్రీన్ హీరో. శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన నాగార్జున అప్పట్నించి కమర్షియల్ ట్రాక్ పట్టాడు.కిల్లర్, క్రిమినల్ చిత్రాలతో కంటెంట్ బేస్డ్ కథల్లో కనిపించి మూసలో వెళుతున్న తెలుగు హీరోలకు భిన్నంగా సెపరేట్ రూట్ ని ఎంచుకున్నారు.

ఆ క్రమంలోనే తనకు ఏ మాత్రం సూటుకాని అన్నమయ్యలాంటి డెవోషనల్ టచ్ ఉన్న పాత్రను ట్రై చేసి తెలుగు ఆడియన్ కి మతిపోగొట్టాడు. అవకాశం కుదిరనప్పుడల్లా కొత్తదనానికి ఆహ్వాన్నిస్తూ వచ్చాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్(Big Boss)లాంటి టెలివిజన్ షోల్లో హోస్ట్ గా కనిపించి తెలుగులో సెపరేట్ ట్రెండ్ సెట్ చేశాడు.

అయితే షోల్లో సూపర్ క్లిక్ అయిన నాగ్ సినిమాల్లో ప్లాప్ అవుతూ వస్తున్నాడు. ఎంతో ఎక్స్ పెక్ట్ చేసి తీసిన మన్మథుడు -2 సినిమా మట్టికరిచింది. సోగ్గాడే చిన్నినాయనా అనే సినిమా తప్ప గత కొంత కాలంగా నాగ్ కి చెప్పుకో తగ్గ హిట్ లేదు, వైల్డ్ డాగ్ ,ఘోస్ట్ సినిమాలు చేసి “నాగ్..! ఆర్ యూ ఓకే..!?” అని పించాడు.

దీనికి కారణం వయసా,సినిమాల రీత్యా వచ్చిన మొనాటనీయా, కథల ఎంపిక కినుకా ఏదీ అంతు పట్టని పరిస్థితి, చాలా ఏళ్లక్రితం రీమేక్ ల్లో మెరిన నాగ్, కనీసం హిట్టు కోసమైనా రీమేక్ ల జోలికి కూడా వెళ్లటం లేదు.ఈ విషయంలో మాత్రం నాగ్ కి జై కొట్టాల్సిందే. నాగార్జున మూవీ హిస్టరీలో ఈ సంధికాలం ఎప్పుడూ వస్తూనే ఉంది. ప్రస్తుతం అది కంటిన్యూ అవుతోంది.

ఇక టోటల్ మన తెలుగు సీనియర్ హీరోల విషయానికి వస్తే మన హీరోలు ఒక టైమ్ లూప్ లోకి వెళ్లిపోయి డాన్స్ లు,ఫైట్లు చేసేస్తున్నారు.ఇండియన్ మూవీకి ఒక హద్దైతే ఉంది. ఒక ఏజ్ దాటిన తరువాత ప్రేక్షకుడికి మన పైత్యాన్ని కొబ్బరి పీచుతో రుద్దేయడమే అవుతుంది.

నిజానికి వయసు కనపడ నీయకుండా నటించడం, నర్తించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారి వయసుకీ హోదాకు అక్కర్లేని వ్యవహారం.అయినా ఎందుకీ కష్టం. టికెట్ కొనుక్కొచ్చిన ఆడియన్ ని ఒకప్పట్లా మెప్పించడానికి మనవాళ్లు పడుతున్న ఆరాటం.తమన తాము నొప్పించకుంటూ ముందుకు సాగుతున్నారు. అవునన్నా కాదన్నా ఇది ఉనికి పోరాటం, ఉన్న ప్లేస్ నుంచి జారిపోతుందేమోనన్న ఆరాటం.

దీంతో తెలుగు సినిమాకు హిట్ కన్నా ప్లాపులే చవిచూస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోలతో పోల్చుకుంటే ఈ డ్యామేజ్ కాస్త తక్కువే అనుకోండి. అయితే తమ వ్యక్తిగత భయాల నుంచి మన తెలుగు సీనియర్ హీరోలు బయట పడాల్సిందే. ఇమేజ్ ల్ని కాకుండా కథను నమ్మకుంటేనే తెలుగు వింటేజ్ హీరోలు అటు ఇండస్ట్రీలోను ఇటు ప్రేక్షకుడి గుండెల్లోను శాశ్వతంగా నిలిచిపోతారు.

You may also like

Leave a Comment