ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆ జాబితాలో సోనాలి బింద్రే (Sonali Bendre) ఒకరు. కొన్నేళ్ల విరామం తర్వాత ఈ స్టార్ నటి ‘ది బ్రోకెన్ న్యూస్'(The Broken News)లో నటించింది. ఇప్పుడు రెండో సీజన్ జీ5 వేదికగా ప్రసారం కానుంది. ఇందులో తన వయసుకు తగిన పాత్ర చేస్తున్నట్లు సోనాలి తెలిపింది.
ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లను గుర్తుచేసుకుంది. అప్పట్లో డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరనే భావన బలంగా ఉండేదని అందుకే తాను సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. బొంబాయి సినిమాలోని పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ కావడంతో దానిని నేను సవాలుగా తీసుకున్నాని ఆ పాటతో మెప్పించాలని లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాని తెలిపింది.
మణిరత్నం లాంగ్ షాట్లకు ప్రాధాన్యమిచ్చేవారని చెప్పింది. అప్పటి వరకు ఐదు సినిమాల అనుభవమే ఉన్న తాను ముంబాయి సినిమాలో ‘హమ్మా హమ్మా’ పాటకు చేసిన స్టెప్పులకు ఆయన తొలి షాట్‌లోనే ఓకే చేశారని తెలిపింది. అది చూసిన కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ మూమెంట్స్ బాగా చేశానని నాకు రూ.100 బహుమతిగా ఇచ్చారని గుర్తుచేసుకుంది.
ఆయన ప్రశంసతో ఎంతో సంబరపడిపోయానని తెలిపింది. ఇక తన డ్యాన్స్‌కు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదనుకున్నానని చెప్పింది. ఇండస్ట్రీలో కొనసాగొచ్చనే ధైర్యం వచ్చిందని, అందుకే ఆ పాట ఎప్పటికీ ప్రత్యేకమే అని తెలిపింది. అప్పటి వరకు తనకు డ్యాన్స్ రాదని విమర్శించిన వారే మెచ్చుకున్నారంటూ చెప్పుకొచ్చింది. శిక్షణ పొందిన డ్యాన్సర్ కానందున కొన్నిసార్లు కొరియోగ్రాఫర్లతో తిట్లు తిన్నానని తెలిపింది.