మంత్రులు, ఉన్నతాధికారులో తమ ప్రాంతంలో పర్యటిస్తే కిందిస్థాయిలో అధికారులు ఆ ఖర్చులు భరించడం.. వాటిని లెక్కల్లో చూపించడం చేస్తుంటారు. అయితే.. నిజానికి కిందిస్థాయి అధికారులు డబ్బులే లేక అధికార కార్యక్రమాలకు ఏం చేయాలో తెలియక నలిగిపోతున్నారంట. ఈ విషయాన్ని ఓ తహసీల్దార్ బహిరంగంగానే ఆరోపించడం సంచలనంగా మారింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు ఇంత ఖర్చులు తాము ఎలా భరించాలని ఆ తహసీల్దార్ నిలదీశాడు. మంత్రుల పర్యటన ముసుగులో లక్షలు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డాడు. పైసా లేనిదే పనిచేయనంటూ ఆ తహసీల్దార్ తెగేసి చెప్పేశాడు. అంతేకాదు.. బహిరంగంగానే లంచం డిమాండ్ చేయడం కొసమెరుపు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలిని మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్ వెటకారంగా మాట్లాడుతూ సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.
‘మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు.. అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తుంటాం’ అని చెప్పుకొచ్చాడు.. ఈ నెల 13వ తేదీన టెక్స్‌టైల్ ప్రిన్సిపల్ సెక్రకెటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం రూ.లక్షా 70వేలు అయిందని తహసీల్దార్ తెలిపాడు. అంతేకాదు, ఆయనకు వాళ్లు పెట్టిన మెనూ కూడా ఆ రైతుకు చూపిస్తూ మడకశిరలో దొరకకపోతే మరో ప్రాంతం నుంచి తెప్పించాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశాడు.
‘ఆ ఖర్చుకు నా జీతం డబ్బులు ఇవ్వాలా? .. ఎవడికీ మా బాధ అర్థం కాదు.. మేం చెప్తేనే బయటకు తెలుస్తుంది.. ఏమన్నా అంటే లంచం తీసుకుంటున్నారు అంటారు.. రైతుల దగ్గర డబ్బులు తీసుకుని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తే మమ్మల్ని ఎదిరిస్తారు.’ అంటూ తహసీల్దార్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.