బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) 70వ జన్మదినం (Birthday) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అధినేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ వృక్షార్చన’ కార్యక్రమాన్నికేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిందన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పెషల్ ట్వీట్ చేశారు.
తెలంగాణ (Telangana)కు నీ జననం ఓ వరం.. విముక్తి కోసం వీరుడు ఉదయించిన తరుణం.. ఉద్యమ ధీరుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌కు కేసీఆర్ ఫోటోతో పాటు ఓ చక్కని కవిత ఉన్న ఫోటోను జత చేశారు. ‘నన్ను నడిపించిన తొలి నేస్తం.. నన్ను తీర్చిదిద్దిన తొలి గురువు.. నా జీవితానికి తొలి హీరో.. నా పోరాటానికి ఉద్యమ స్ఫూర్తి మీరే.. గుండెల నిండా ప్రేమతో నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు’ అని రాసి ఉన్న ఫోటో కవిత షేర్ చేశారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కాగా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్రంలో అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇక కేసీఆర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేస్తామని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు. శనివారం కేక్ కటింగ్, పండ్ల పంపిణీ చేపట్టాలని అభిమానులకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమవుతున్నారు.