Telugu News » Telangana : రాష్ట్రంలో ఎంపీ టికెట్ల పంచాయతీ.. ఫుల్ డిమాండ్ లో బీజేపీ.. !

Telangana : రాష్ట్రంలో ఎంపీ టికెట్ల పంచాయతీ.. ఫుల్ డిమాండ్ లో బీజేపీ.. !

బీజేపీకి తెలంగాణలో నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో భాగంగా 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు.

by Venu
bjp-big-plans-for-parliament-elections

తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో బీజేపీ సీట్లకు భారీ పోటీ నెలకొనడం.. పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయం విజయం సాధించి.. మోడీ (Modi) ప్రధానిగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారనే నమ్మకం బలంగా నెలకొందని అందుకే బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని చర్చలు సాగుతున్నాయి.

ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలనే ఆలోచనతో.. అధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వరుస యాత్రలు చేపడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ (BRS) నేతలకు గాలం వేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాగర్ కర్నూలు (Nagar Kurnool) సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రెండు రోజుల తేడాతో బీజేపీ కండువా కప్పుకొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే, బలంగా పనిచేస్తున్న మోడీ చరిష్మాతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే ధీమాగా ఉన్న నేతలు.. బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు సైతం బీజేపీలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఖరారు అవ్వగా.. కరీంనగర్ ఎంపీ సీటు బండి సంజయ్ కు, నిజామాబాద్ పార్లమెంటు సీటును ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఖరారు చేశారు. మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును అధిష్టానం పెండింగులో పెట్టింది.

గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవేళ్ల సీటును దక్కించుకోగా.. ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మహబూబ్ నగర్ , మల్కాజిగిరి నియోజక వర్గాలలో గట్టి పోటీ నెలకొంది. అయితే బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలని కమలం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక బీజేపీకి తెలంగాణలో నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో భాగంగా 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇందుకోసం వలసా వచ్చే నేతలను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది.

రామమందిర నిర్మాణం, పదేళ్ల అభివృద్ధి పనులతో ఓటర్లలో మోడీ పట్ల ఆదరణ పెరిగిన నేపథ్యంలో కనీసం 8 స్థానాలనైనా సాధించాలని బీజేపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు నేతలు దీటైన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ప్రస్తుత వాతావరణం తమకు అనుకూలంగా ఉందని గట్టిగా నమ్మడం వల్ల బీజేపీ నాయకుల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ నెలకొందని ప్రచారం జరుగుతోంది..

You may also like

Leave a Comment