ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress), ఏపీలో పాగావేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హస్తం, హస్తవాసి ఏపీలో కలిసి వస్తుందా? అనే సందేహాలు కలగడం కామన్.. కానీ తెలంగాణ (Telangana)లో అస్తవ్యస్తం నుంచి.. ‘హస్త’ గతం వరకు నడిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ పాత్ర కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే..
ఇదే సమయంలో టీడీపీ (TDP).. జనసేన (Janasena) పొత్తులతో ఎన్నికలకు వెళ్తుండగా.. కాంగ్రెస్ మాత్రం షర్మిలతో రాజకీయం ప్రారంభించింది. వైసీపీ వ్యూహాలను తట్టుకోవాలంటే జగన్ (Jagan)కు ధీటుగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ప్రచారంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ పై గురిపెట్టిన కాంగ్రెస్.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చిన రేవంత్.. ఏపీలో కూడా కొత్త వ్యూహరచన చేసి పార్టీని గట్టెక్కిస్తారనే నమ్మకంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అలా సక్సెస్ ఫుల్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకువెళ్ళి అక్కడ హస్త రేఖలు సరిచేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా వరకూ రేవంత్ బేఫికర్ గా ఉన్నారు కాబట్టి, ఏపీ ఎన్నికల మీద కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక కీలక ప్రాంతాలు నగరాలలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ కి కొత్త బలం ఇస్తారని భావిస్తున్నారు.
మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పదేళ్ళుగా అధికారం లేక చితికిపోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉనికి కోసం పోరు సాగిస్తోంది. అందువల్ల కాంగ్రెస్ కి అంగబలం అర్ధబలం కూడా తెలంగాణా నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకొనే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అదీగాక రేవంత్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తే, జగన్ మీద సరికొత్త విమర్శలు వినే అవకాశాలు ఏపీ జనానికి ఉంటాయని అంటున్నారు.
ఇకపోతే రేవంత్ రెడ్డి మాటల దూకుడుకు.. పంచులకు తెలంగాణాలో యూత్ అభిమానులుగా మారిపోయారు. ఏపీలో కూడా రేవంత్ కి క్రేజ్ ఉందని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ ని మాత్రమే విమర్శించి ఊరుకుంటారా? లేక ప్రతిపక్షంలో చంద్రబాబుని కూడా విమర్శిస్తారా? అన్నది కీలక చర్చకు దారితీస్తుంది. ఒకవేళ కేవలం జగన్ పై విమర్శలు చేస్తే విని ఎంజాయ్ చేస్తారు తప్ప ఫలితం ఉండదనే వాదన వినిపిస్తుంది..
అలా కాకుండా ఏపీలోని మొత్తం పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్న అన్ని పార్టీలను విమర్శిస్తే కనుక కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ పెరిగే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది అని అంటున్నారు.. మరోవైపు ప్రతీకార రాజకీయాల్లో జగన్ ముందుంటే.. రేవంత్ మాత్రం వాటన్నింటిని పక్కనపెట్టి.. ఇగోలు విడిచిపెట్టి సుపరిపాలనతోనే ప్రజలకు, ప్రత్యర్థులకు చేరువ కావాలనుకోవడం విశేషం అని కితాబు ఇస్తున్నారు..