రంగారెడ్డి (Rangareddy) జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. నేతాజీనగర్ (Netajinagar)లోని, ఏషియన్ బ్యారల్స్ డ్రమ్ముల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడటంతో, ఈ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకొన్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
ప్రమాద సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.. కాగా ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రకాశం జిల్లా (Prakasam District), త్రిపురాంతక మండలం, రేపల్లె (Repalle) గ్రామంలో ఉన్న ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.
ఈ ఘటనలో మూడు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతైయ్యాయి. గుడిసెల పక్కనే ఉన్న గడ్డివాముకి మంటలు అంటుకొని అగ్నికీలలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. దీంతో వారు ఫైర్ ఇంజన్ సిబ్బందిని ఆశ్రయించారు. ఈ ఘటనలో నష్టపోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం..