ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు (Degree Student Suicide) ఆమె కుటుంబంలో వివక్ష(Discrimination) చూపించడమే కారణంగా స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజుల్లో అబ్బాయిలే కంటే అమ్మాయిలు చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కేవలం చదువులోనే కాకుండా ఉద్యోగాల్లోనూ ఆడవాళ్లు పై చేయి సాధిస్తున్నారు.
సమాజంలో నేటికి వారి పట్ల కొంత వివక్ష ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఆఖరు అంతరిక్ష పరిశోధన రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుతుండగా.. కొందరు పేరెంట్స్ మాత్రం తమకు ఆడపిల్ల పుట్టిందంటూ పదేపదే వారి పట్ల సూటిపోటి మాటలు ఆనడం వలన మెంటల్‌గా వీక్ అయిపోయి తనువు చాలిస్తున్నారు.
సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అటువంటి వారికి కుటుంబంలో కూడా మద్దతు లభించకపోతే ఇంకా వారు ఎవరికి చెప్పుకోగలుగుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తాజాగా డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినీ చనిపోయే ముందు తన ఫ్రెండ్‌కు పంపించిన మెసేజ్ (Last Message) వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని కాప్రా మండలం జవహర్ నగర్ పీఎస్ పరిధి సాయినగర్ కాలనీలో రెండస్థుల భవనంపై నుంచి శివానీ(18) దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా.. మృతురాలు సూసైడ్ అటెంప్ట్‌కు ముందు తన ఫ్రెండ్ కు మెసేజ్ చేసినట్లు గుర్తించారు. ‘ఆడపిల్ల అని బాధపడకండి.మా అమ్మనాన్నకు చెప్పు.. మరో జన్మంటూ ఉంటే వారి కడుపునే మగపిల్లాడిలా పుడతా’ అని స్నేహితురాలికి మెసేజ్ చేసి బిల్డింగ్ మీద నుంచి దూకినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. అయితే, కేవలం పేరెంట్స్ వివక్ష చూపించడం వల్లే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని నెట్టింట చర్చ జరుగుతోంది.