Featured posts
స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu). ఆయితే.. తనను హౌస్ రిమాండ్ లో ఉంచాలని ఏసీబీ కోర్టులో ఆయన వేసిన పిటిషన్ పై తుది తీర్పు వచ్చింది. రెండు రోజుల విచారణ తర్వాత తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం, సెక్యూరిటీ దృష్ట్యా.. ఆయనను హౌస్ రిమాండ్ కు అనుమతించాలని వాదించారు ఆయన తరపు న్యాయవాదులు. దీనికి అనుమతి ఇవ్వొద్దని వాదించారు సీఐడీ తరపు న్యాయవాదులు.
ఇరువర్గాల లాయర్లు పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (ACB) కోర్టు తీర్పు వెల్లడిస్తూ.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ ను తిరస్కరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ముప్పులేదన్న సీఐడీ వాదనాలను సమర్ధించింది. భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో విభేదించింది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు పేపర్ల పరిశీలనకు చంద్రబాబు లాయర్లకు అనుమతి ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.
మరోవైపు, రాజమండ్రి జైలులో కుటుంబసభ్యులతో ములాఖత్ అయ్యారు చంద్రబాబు. లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. కుటుంబం కన్నా రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబును అన్యాయంగా జైలులో వేశారని భువనేశ్వరి భావోద్వేగానికి లోనయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు వేసింది సీఐడీ. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు సమయం కోరిన నేపథ్యంలో వాదనలను బుధవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.