బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదం(Road Accident)లో మృతి చెందడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక(By Election) అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ(BJP) వంశా తిలక్(Vamsha Tilak) ను ఖరారు చేసింది.
ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ శ్రీగణేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో తమ అభ్యర్థిగా డాక్టర్ వంశా తిలక్‌ను ఖరారు చేస్తూ ఆ పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఎన్ సదాలక్ష్మి కుమారుడైన వంశాతిలక్ వృత్తిరీత్యా వైద్యుడు. కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆసక్తి కనబర్చినా, సామాజిక, రాజకీయ అంశాల దృష్ట్యా వంశా తిలక్‌నే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఎవరు గెలుస్తారని ఉత్కంఠగా మారింది.
లాస్య నందిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో ఆస్పత్రిపాలు కాగా 2023 ఫిబ్రవరిలో కన్నుమూశారు. సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి నెలలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కంటైనర్ ఢీకొని ఆ తర్వాత రోడ్డు పక్కనే రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.