ఇజ్రాయిల్ -హమాస్ (Israel-Hamaas) నేతృత్వంలోని పాలస్తీనియన్ తీవ్రవాదుల(Terroists)కు మధ్య జరుగుతున్న యుద్ధం (War) తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్ పౌరులను తమ వద్ద బంధీలుగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌తో కయ్యానికి కాలు దువ్విన విషయం తెలిసిందే. 07 అక్టోబర్ 2023న గాజా స్ట్రిప్ నుంచి వందల సంఖ్యలో రాకెట్స్ ఇజ్రాయిల్ పైకి దూసుకొచ్చాయి.
ఈ ఘటనతో సీరియస్ అయిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహూ (Benjimin nethanyahu) హమాస్‌ను తుడిచి పెట్టేంతవరకు యుద్ధాన్ని విరమించేది లేదని ప్రకటించారు. నాటి నుంచి నేటివరకు యుద్ధం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయిల్ గత వారం జరిపిన వైమానిక దాడిలో హమాస్ అగ్ర కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ధృవీకరించారు.
మార్చి 11న సెంట్రల్ గాజాపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో ఇస్సా మరణించారని వెల్లడించారు.ఇంకా మిగిలిన అగ్రనేతలు సైతం సొరంగాల్లో దాక్కున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేయడానికి ఇస్సానే ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు.
అయితే, అమెరికా ప్రకటనపై హమాస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ చేసిన దాడిలో 20 మంది మరణించగా.. 200 మందిని ఐడీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe biden), ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహులు సోమవారం ఫోన్ లో సంభాషించినట్లు తెలుస్తోంది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం.ఈ మేరకు వైట్‌హౌస్ (White house) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గాజాకు వెళ్లే మానవతా సాయం, బంధీలను స్వదేశానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల గురించి ప్రధాని నెతన్యాహుని బైడెన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక భద్రతను నిర్దారించడం వంటి అంశాలను ప్రస్తావించారు’ అని ప్రకటనలో పేర్కొంది.