బెంగళూరు (Bengaluru), రామేశ్వరం కేఫ్‌లో రెండు రోజుల క్రితం బాంబు పేలడం (Bomb Blast)తో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనలో నిందితుడిని గుర్తించారు. అదీగాక పేలుళ్ల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. కాగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని బెంగళూరు నగర కమిషనర్ బీ దయానంద నిన్న తెలిపారు.
ఈ నేపథ్యంలో కడప (Kadapa) జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేగింది. ఈమేరకు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో.. మైదుకూరు (Maidukuru)లో ఎన్ఐఏ (NIA) సోదాలు చేపట్టింది. మైదుకూరు మండలం చెల్రోపల్లె వద్ద పిఎఫ్ఐ సభ్యుడు సలీం ఓ నివాసంలో తలదాచుకొన్నట్లు అందిన సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఈ క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్ తో ఎన్ఐఏ అధికారులు సలీంను అరెస్టు చేశారు.. కాగా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. చెర్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజులు తన వద్ద ఉంటానని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చెర్లోపల్లి మస్జీద్ లో సలీమ్ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే సలీంపై రెండులక్షల రూపాయల రివార్డ్ ఉంది.
మరోవైపు మంగళూరులో 2022లో జరిగిన కుక్కర్ పేలుడుకు, రామేశ్వరం కేఫ్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అదేవిధంగా ఈ పేలుడుకు కారణమైన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్‌ను నిన్న సందర్శించారు. పేలుడు ఘటనలో గాయపడి బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.