Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగిన కేసీఆర్ (KCR) పాలనపై, రేవంత్ రెడ్డి (Revanth Reddy) రోజు రోజుకు సంచలన నిర్ణయాలు తీసుకొంటున్న విషయం తెలిసిందే.. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న విద్యుత్, కాళేశ్వరం, ఆర్థిక ప్రగతి అంశాలలోని వైఫల్యాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళే దిశగా అడుగులు వేస్తుంది. ఇలా పొగడ్తలు.. విమర్శల మధ్య రేవంత్ పాలనలో నెలరోజులు గడిచిపోయాయి.. అయితే నెల రోజుల పాలనపై సీఎం ట్వీట్ చేశారు.
తెలంగాణ (Telangana)లో బానిస సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు.
పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్మిలు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని చెప్పారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకొన్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇస్తున్నట్టు రేవంత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ తో, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ (Congress) సిద్దం అవుతోంది. ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ఇక తెలంగాణలో ఆరు హామీలు పూర్తిగా అమలు చేసే దిశగా మంత్రులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.





