Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు పరిహారం ఇవ్వలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పంట నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డి సర్వే చేయించారని, నష్టపోయిన రైతులందరికీ ఎన్నికల తర్వాత పరిహారం అందుతుందని ప్రకటించారు. రైతులు, కౌలు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, నిరాశ నిస్పృహలకు లోను కావద్దని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని సైతం కొనాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
వర్షానికి కొట్టుకపోయిన ధాన్యానికి అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల మధ్యలో డ్రాప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అందుకే కేసీఆర్ భయపడి ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జైలులో కేసీఆర్‌కు డబుల్ రూమ్ కట్టించారని, కుటుంబ సభ్యులందరినీ అదే జైలులో ఉంచుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.