Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
పాకిస్థాన్(Pakistan)లో ఉగ్రవాదుల(Terrorists) మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh) స్పందించారు. దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలమన్నారు. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతామని హెచ్చరించారు. తాము పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ స్నేహమే కోరుకుంటామని కేంద్రం ప్రభుత్వ(Central Govt) వైఖరిని ఆయన వెల్లడించారు.
కాగా, బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్ష్యంగా చేసుకొందని తెలిపింది. భారత విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది.
భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు వెల్లడించింది. ఈనేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ చెప్పింది అక్షరాలా నిజమన్నారు. భారత్ శక్తిని పాకిస్థాన్ అర్థం చేసుకోవడం ప్రారంభించిందని తెలిపారు. అలాగే భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదని, వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదని స్పష్టం చేశారు.
తన పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని తెలిపారు. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించదని వ్యాఖ్యానించారు. మరోవైపు దీనిపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని.. భారత వ్యతిరేక ప్రచారమని చెప్పింది. ఇతర దేశాల్లో హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని తేల్చిచెప్పింది.