Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
కొత్తగా నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు దేశంలో వివాదాస్పదంగా మారింది.. ఈ చట్టం అమలుతో పాటు నిబంధనలను నిలిపివేయాలని పిటీషన్లు దాఖలు అయ్యాయి.. కాగా వీటిని ఈ రోజు విచారించిన సుప్రీం కోర్టు (Supreme Court).. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 8వ తేదీలోగా తన స్పందన తెలియజేయాలని కోరింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు సుప్రీంకోర్టులో సీఏఏని సవాల్ చేస్తూ మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలో జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్లలో ప్రధానంగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీడ్ (IUML), మరియు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఉన్నాయి.
మరోవైపు ముస్లిం సమాజంపై ఇది వివక్ష అని కాంగ్రెస్ (Congress) నాయకుడు జైరాం రమేష్, తృణమూల్ నాయకుడు మహువా మొయిత్రా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2019లో కూడా పౌరసత్వ సవరణ చట్టం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో కూడా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆ సమయంలో నిబంధనలు నోటిఫై కాకపోవడంతో సుప్రీం కోర్టు వీటిని విచారించలేదు.
తాజాగా మార్చి 11న ఈ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేసింది. ఇక ఈ చట్టం ప్రకారం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ముస్లిమేతర హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు CAA ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది.