శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే (Airport Run way) మీద చిరుతపులి(Leoperd) సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన అధికారులు ఎయిర్ పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు ఒక బోను సైతం ఏర్పాటు చేశారు. అందులో ఒక మేకను కూడా ఉంచారు. అంతేకాకుండా 9 ట్రాప్ కెమెరాలను సైతం అమర్చారు.
చిరుత కదలికలు ట్రాప్ కెమెరాల్లో (Trop cams) స్పష్టంగా రికార్డు అయినట్లు అధికారులు గుర్తించారు. అదే చిరుత రన్ వే పైకి వచ్చి ఉంటుందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ వెల్లడించారు. కొన్ని నెలల కిందట షాద్ నగర్ ప్రాంతంలోనూ చిరుత కదలికలను గుర్తించినట్లు అధికారి పేర్కొన్నారు.
ఎయిర్ పోర్టు రన్ వే పైకి వచ్చిన చిరుతను ఎలాగైనా పట్టుకుంటామని శంషాబాద్ డీఎఫ్వో(DFO) ప్రకటించారు. చిరుత 7 ఫీట్ల ఎత్తైన గోడను దూకి ఎయిర్ పోర్టులోనికి వచ్చినట్లు విమానాశ్రయ సిబ్బంది గుర్తించారన్నారు.
మొన్న సంచరించిన ప్రాంతంలోనే ఆదివారం రాత్రి కూడా ఆ చిరుత సంచరించగా.. అవి ట్రాప్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో సోమవారం అదనంగా మరో మూడు బోన్లు, 6 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దగ్గరలో నీటి కుంట ఉంది కాబట్టి..అక్కడకు చిరుత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రిలోకా చిరుతను పట్టుకుంటామన్నారు. సంచరిస్తున్న చిరుత వయసు రెండేళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.