తెలంగాణ (Telanganaa) రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోందని తెలుస్తోంది. అయిన తమ కంట్లో ఉన్న నలుసు చూడలేని వారు పక్క వారి కళ్ళలో ఉన్న నలుసు ఏం చూస్తారని కేటీఆర్ తీరు చూస్తున్న వారు అనుకొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతల ఆరోపణలు అబద్ధం అని నిరూపించుకోవాలసింది పోయి.. అనుభవం లేని వారీగా మాట్లాడటం హస్తం నేతల ఒళ్ళు మండిపోయేలా చేస్తుందని అనుకొంటున్నారు..
మరోవైపు కేసీఆర్ (KCR) కాలు గోటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి.. సరిపోడంటూ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.. ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) విరుచుకుపడ్డారు.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించాడని.. ఆ విషయాన్ని గుర్తించక మీరేదో రాష్ట్రంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించుకోవడం అవివేకం అని విమర్శించారు..
వాస్తవానికి దూరంగా రాజకీయాలు చేస్తున్న మీరు.. మీ ప్రభుత్వ హయాంలో ప్రవర్తించిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహాదేవపూర్ లో వేణుగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంకట్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడారని.. మీరెప్పుడైనా దాని గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ మీ బాషా మార్చుకోవాలని, ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి సీఎం అయిన వ్యక్తి అని.. నువ్వు కేసీఆర్ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని వెంకట్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా సరిపోవంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. నీ అహంకారంతోనే బీఆర్ఎస్ ప్రజల్లో చులకనగా మారిందని ఎద్దేవా చేశారు..