దేశంలో రెండవ అతి పెద్ద గిరిజన జాతర నాగోబా (Nagoba Jatara )కు సాంప్రదాయ పూజలతో క్రతువు మొదలైంది. కేస్లాపూర్ (Keslapur) లోని నాగోబా జాతరకు సంబంధించి మేస్త్రం వంశస్తులు సమావేశం అయ్యారు. జాతర తేదీలను ఈ సమావేశంలో నిర్ణయించారు.పుష్య మాస అమావాస్యను పురస్కరించుకుని ఫిబ్రవరి 9 నుంచి నాగోబా జాతర మొదలు కానుంది.
సమావేశం అనంతరం కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి మేస్త్రం వంశస్థులు బయలు దేరారు. ప్రతి ఏడాది సుమారు 250 మంది ఆదివాసి మెస్రం వంశస్థులు 125 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించి గోదావరి నుంచి గంగాజలాలను తీసుకు రావడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 5 వరకు గంగా జలాలను తీసుకు వచ్చి కేస్లాపూర్ లోని మర్రి చెట్టుకు కలశాలు కడతారు. ఆ తర్వాత జాతర ప్రారంభం తర్వాత నాగోబాను ఆ జలాలతో అభిషేకిస్తారు.మహా పాదయాత్రకు వెళ్లే మార్గం, ఎక్కడ బస చేయాలనే విషయాలపై చర్చించి ఈ రోజు సమావేశంలో ఒక రూట్ మ్యాప్ రూపొందించారు.
ఆచారం ప్రకారం మెస్రం వంశస్తులంతా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బస చేస్తారు. అనంతరం మరుసటి రోజు నుండి పాదయాత్ర హస్తినమడుగు వరకు కొనసాగనుంది. ఆదివాసుల పూజారి ప్రధాన్, నాగోబా ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు.