సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మొన్నటి దాకా దావోస్ సమావేశాలతో తీరిక లేకుండా గడిపారు. ఆ తర్వాత లండన్ (London) చేరుకున్నారు. వెంటనే థేమ్స్ రివర్ అథారిటీ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఇటీవల లండన్ లో పలు చారిత్రక కట్టడాలు, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్ తో పాటు మరికొన్ని చారిత్రాత్మక నిర్మాణాలను సీఎం రేవంత్ రెడ్డి చూశారు. ఈ సందర్బంగా ఈ కట్టడాలు దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో శ్రీలాంటి పాత్ర పోషించాయనే అంశాలపై ఆరా తీశారు.ఆ అంశాల ఆధారంగా తెలంగాణలో పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఆలోచనలు చేయాలని సీఎం భావిస్తున్నారని సమాచారం.
పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచవచ్చు, ఉపాధి కల్పనకు ఎలా చేయాలనే విషయాలను సీఎం అధ్యయనం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి గుర్తింపు ఎలా తీసుకు రావాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలు ఏంటి అనే పలు విషయాల గురించి ఆయన అధ్యయనం చేస్తున్నారు.
పర్యాటక రంగానికి గుర్తింపు రావాలంటే ఎలాంటి ప్రాధాన్యతలు ఎంచుకోవాలి, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి షా నవాజ్ ఖాసీం, ఓఎస్డీ అజిత్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సీఎం వెంట ఉడన్నారు.