స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఆధీనంలోని X(ట్విట్టర్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవలే ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటం, లాగిన్‌లో సమస్యలు వంటివి తలెత్తిన విషయం తెలిసిందే.
తాజాగా ఎక్స్‌లో మరోసారి అలాంటి సమస్యే తలెత్తింది. అయితే, ఈ సారి ట్వీట్స్ మాయం కావడంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. గురువారం ఉదయం నుంచి దేశ ప్రధాని మోదీ సహా చాలా మంది ట్విట్టర్ పోస్టులు కనిపించడం లేదు. ఆయా ఖాతాల్లోని పోస్టులు లోడ్ అవ్వడం లేదు.
ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం #Twitter Down ట్రెండింగ్‌లో ఉంది. ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రో వెర్షన్లు కూడా పనిచేయడంలేదు. పోస్టులు మాయం అవ్వడంతో యూజర్లు ఏం జరిగిందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. అయితే, ఈ సమస్యపై ఎక్స్ ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఎక్స్‌లో సమస్యలు తలెత్తడం ఇదేం తొలిసారి కాదు. ఈఏడాది మార్చి, జూలైలో కూడా ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాలే ఎక్స్ అంతరాయానికి కారణాలుగా తెలుస్తోంది. మరోవైపు, సాంకేతిక కారణాల వల్ల ఎక్స్ సేవలకు అంతరాయం కలుగుతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.