అమెరికాను హరికేన్ హిల్లరీ తుపాన్ వణికిస్తోంది. 84 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా దక్షిణ కాలిఫోర్నియా (Southern California)లో మాత్రం చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
కాగా రేపు(మంగళవారం)పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.భారీ వర్షాలు కురుస్తుండటంతో నెవాడా(Nevada)లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా (California)లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.
అసాధారణమైన వేసవి తుపానుకు తోడు భూమి కంపించడం (Eartquake)తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి (Ojai city) ఈశాన్యాన ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించింది.భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.లాస్ ఏంజెల్స్(Los Angeles) సమీపంలో కూడా 3.1, 3.6 తీవ్రతతో భూమి రెండు సార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.