US : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి సత్తా చూపారు. ఎమర్సన్ కాలేజ్ పోల్ లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇదే సమయంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ కూడా ఆయనకు పోటీనిచ్చారు. వీరిద్దరికీ చెరి 10 శాతం ఓట్లు వచ్చాయి. కానీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని మాత్రంవీరు అందుకోలేకపోయారు. 56 శాతం ఓట్లతో ఆయన వీరికన్నా ముందంజలో ఉన్నారు, గత జూన్ లో 21 శాతం ఓట్లను రాన్ పొందగలిగినప్పటికీ ప్రస్తుతానికి ఆయన ‘హవా’ తగ్గిపోయి 10 శాతానికి దిగజారింది.
అయితే రామస్వామి మాత్రం నాడు 2 శాతం ఓట్లను పొందినా ఈ సారి తన శాతాన్ని పెంచుకోగలిగారు. ఆయన మద్దతుదారుల్లో సుమారు సగం మంది ఆయనకే ఓటు చేస్తామని స్పష్టం చేశారు. డెశాంటిస్ మద్దతుదారుల్లో కేవలం మూడోవంతు ఆయన పట్ల మొగ్గు చూపారు. ఏమైనా ట్రంప్ సపోర్టర్లలో 80 శాతం మంది తమ నేతకే ఓటు చేస్తామన్నారు.
డెశాంటిస్ అభ్యర్థిత్వానికి మద్దతునిస్తున్న ‘సూపర్ పీఏసీ’ నుంచి లీకయిన మెమో ఈ ఫలితాలను రిలీజ్ చేసింది. రామస్వామికి పీజీ డిగ్రీలవారి గ్రూప్ నుంచి 17 శాతం ఓట్లు . 35 ఏళ్ళ లోపువారి గ్రూప్ నుంచి 16 శాతం ఓట్లు లభించాయని ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కిమ్ బాల్ తెలిపారు. కాగా డెశాంటిస్ కి గత జూన్ లో పీజీ ఓటర్ల నుంచి 38 శాతం ఓట్లు లభించగా ప్రస్తుతం అది 14 శాతానికి పడిపోయిందని, 35 ఏళ్ళ లోపువారినుంచి ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 15 శాతమని ఆయన వివరించారు.
ఇక డెశాంటిస్, రామస్వామితో బాటు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చే వారం జరగనున్న తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్ లో నేషనల్ స్టేజ్ పై తలపడవలసి ఉంటుంది. దీనికి ట్రంప్ కూడా హాజరు కావలసి ఉన్నా.. ఆయన గైర్ హాజరు కావచ్చునని తెలుస్తోంది. కాగా ఈ పోల్ ని ఈ నెల 16-17 తేదీల్లో వెయ్యిమంది రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి నిర్వహించారు. తనపై ఉన్న కేసుల దృష్ట్యా ట్రంప్ ఈ డిబేట్ కి హాజరయ్యే అవకాశాలు లేవంటున్నారు.