జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఇలాంటి అనుభవానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుని కనుమరుగైన వారు కొందరైతే.. అన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయ తీరాలను చేరుతున్నవారు మరికొందరు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఒకరు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరో ఏడాది కింద వచ్చిన లైగర్ సినిమా ప్లాఫ్‌తో చాలా వరకు నిరాశకు లోనయ్యాడు. ఈ క్రమంలో సినిమాల ఎంపికలో డైలమాలో పడిపోయాడు. ఇలాంటి సమయంలో కొంత గ్యాప్ ఇచ్చిన రౌడీబాయ్.. సమంతాతో ఖుషీ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’(Family Star)గా అవతారమెత్తాడు. కుటుంబ నేపథ్యమున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. గీతగోవిందం సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా లైగర్ సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘లైగర్’ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విజయ్ మాటతీరుపై ఆ సినిమా విడుదల సమయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
దీనిపై స్పందించిన విజయ్..‘లైగర్’కు ముందు.. తర్వాత నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నా. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకొన్నా. అప్పటి నుంచి అదే అమలు చేస్తున్నా. ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష’ అని అన్నాడు.
ఇక ‘ఫ్యామిలీస్టార్’ గురించి మాట్లాడుతూ.. ‘మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి కుటుంబలో ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో అది మా నాన్న. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే నాకు మా నాన్నే గుర్తొచ్చారు. అందుకే నా పాత్రకు కూడా ఆయన పేరే పెట్టాం.’ అని తెలిపాడు.